NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 7:28 pm Posted by : NAMASTHE BHARAT

కైసర్‌నగర్‌లో భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు

కైసర్‌నగర్‌లో భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు

డబుల్ బెడ్ రూమ్ డిగ్నిటీ అపార్ట్‌మెంట్స్‌లో కొలువుదీరిన అమ్మవారికి ప్రత్యేక పూజలు

సంప్రదాయ దుస్తుల్లో మహిళల బోనాల సమర్పణ

వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ

భక్తులతో సందడిగా మారిన కైసర్‌నగర్ డిగ్నిటీ అపార్ట్‌మెంట్స్

అనంతరం భక్తులకు ప్రసాద వితరణ

కుత్బుల్లాపూర్, ఆగస్టు 10: ( నమస్తే భరత్ ); గాజులరామారం డివిజన్ పరిధిలోని కైసర్‌నగర్ డబుల్ బెడ్‌రూమ్ డిగ్నిటీ అపార్ట్‌మెంట్స్‌లో ఆదివారం బోనాల పండుగ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డిగ్నిటీ అపార్ట్‌మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో అపార్ట్‌మెంట్స్ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, బోనాలను అందంగా అలంకరించి అమ్మవారికి సమర్పించారు. ప్రత్యేక పూజలు, నైవేద్య కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. దీంతో అపార్ట్‌మెంట్స్‌ ప్రాంగణం భక్తి వాతావరణంతో కళకళలాడింది. ఈ వేడుకలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కోలన్ హన్మంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సొంటి రెడ్డి పున్నారెడ్డి, సూరారం పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ బాలరాజు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తెలంగాణ సాయి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. తరతరాలుగా వస్తున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలను కొనసాగిస్తూ భక్తిశ్రద్ధలతో బోనాల పండుగను నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. వేడుకల్లో చిన్నారులు, మహిళలు, యువతతో పాటు అపార్ట్‌మెంట్స్ వాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పండుగ సందర్భంగా అపార్ట్‌మెంట్స్‌లో సందడి నెలకొంది. కార్యక్రమం ముగిసిన అనంతరం భక్తులకు నిర్వాహకులు ప్రసాద వితరణ చేపట్టారు. వేడుకల్లో డిగ్నిటీ అపార్ట్‌మెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక నాయకులు, మహిళలు, యువత, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.