కలెక్టరేట్‌లో భక్తిశ్రద్ధలతో బోనాల సంబరాలు



-భువనేశ్వరీ మాత ఆలయంలో ఘనంగా పూజలు
-అదనపు కలెక్టర్ల ఆధ్వర్యంలో వేడుకలు
-డప్పు వాయిద్యాలు, పోతరాజుల నృత్యాలతో సందడి
-భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాల సమర్పణ
-ఉత్సాహంగా పాల్గొన్న అధికారులు, ఉద్యోగులు
-తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా వేడుకలు
కుత్బుల్లాపూర్, ఆగస్టు 7 ( నమస్తే భరత్ ): తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన బోనాల ఉత్సవాలను మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని భువనేశ్వరీ మాత ఆలయంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, విజయేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. పోతరాజుల నృత్యాలు, డప్పు వాయిద్యాల నడుమ అధికారులు, ఉద్యోగులు బోనాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువెళ్లారు. మహిళా ఉద్యోగులు సంప్రదాయ వస్త్రధారణలో అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు కోరుతూ జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.