NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 4:06 pm Posted by : NAMASTHE BHARAT

ఎర్రగడ్డ రైతు బజార్‌లో ప్లాస్టిక్‌కు గుడ్‌బై.. క్లాత్ బ్యాగ్‌ల వినియోగానికి పెద్దపీట

ఎర్రగడ్డ రైతు బజార్‌లో ప్లాస్టిక్‌కు గుడ్‌బై.. క్లాత్ బ్యాగ్‌ల వినియోగానికి పెద్దపీట
-పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా అవగాహన కార్యక్రమం
-వినియోగదారులకు ఉచితంగా క్లాత్ బ్యాగుల పంపిణీ
-ప్లాస్టిక్ వల్ల ఆరోగ్యానికి, ప్రకృతికి ముప్పు: డా. చేకూరు హనుమంతు నాయుడు
-యువత పర్యావరణ పరిరక్షణలో ముందుండాలని పిలుపు
-రైతు బజార్‌లో ప్లాస్టిక్ నిర్మూలనకు నిరంతర చర్యలు
-‘క్లాత్ బ్యాగ్ అలవాటు.. స్వచ్ఛమైన భవిష్యత్తుకు బాట’ అంటూ సందేశం

కుత్బుల్లాపూర్, జూలై 12 ( నమస్తే భరత్ ): పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్య రక్షణను లక్ష్యంగా పెట్టుకొని ఎర్రగడ్డ రైతు బజార్‌లో ‘ప్లాస్టిక్ రహిత సమాజం – క్లాత్ బ్యాగ్ వినియోగం’ అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని తగ్గించి, పర్యావరణహితమైన క్లాత్ బ్యాగుల వినియోగాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320-డి మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్స్ జిల్లా చైర్మన్ లయన్ డా. చేకూరు హనుమంతు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి మాత్రమే కాకుండా మానవ ఆరోగ్యానికి కూడా తీవ్ర ముప్పుగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. యువతలో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం పెంపొందించడం అత్యంత అవసరమని ఆయన అన్నారు. “మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా, క్యాన్సర్ వంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు” అని పేర్కొంటూ ప్రజలందరూ క్లాత్ బ్యాగుల వినియోగాన్ని నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతు బజార్‌కు వచ్చిన వినియోగదారులకు ఉచితంగా క్లాత్ బ్యాగులను పంపిణీ చేశారు. ప్లాస్టిక్ సంచులకు బదులుగా వస్త్ర సంచులనే వినియోగించాలని నిర్వాహకులు అవగాహన కల్పించారు. ఎర్రగడ్డ రైతు బజార్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమేష్ మాట్లాడుతూ, రైతు బజార్ పరిధిలో ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు అధికారులు, సిబ్బంది ప్రతిరోజూ రైతులు, వినియోగదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ సమితి చైర్మన్ లయన్ అన్యం కోటిరెడ్డి, ప్రోగ్రామ్ చైర్‌పర్సన్, సూపర్వైజర్లు శ్రీ సతీష్ కుమార్, శ్రీ ఏడుకొండలు, శ్రీమతి సునీత, మార్కెట్ కమిటీ సిబ్బంది, రైతులు, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. చివరగా “ప్లాస్టిక్‌కు గుడ్‌బై చెప్పండి – క్లాత్ బ్యాగ్‌ను అలవాటు చేసుకోండి.. పర్యావరణాన్ని పరిరక్షించండి” అనే సందేశంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. పర్యావరణహిత జీవనశైలిని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు.