బెడ్‌సైడ్ కార్మికులకు నెలకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలి: SPS రాష్ట్ర అధ్యక్షుడు కుర్రి సైదయ్య
నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో (మూర్తి)
మణుగూరు, జూన్ 21: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న బెడ్‌సైడ్ కార్మికులు, శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్ సిబ్బందికి నెలకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని SPS రాష్ట్ర అధ్యక్షుడు కుర్రి సైదయ్య డిమాండ్ చేశారు.మణుగూరు ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో సిద్ధెల తిరుమలరావు అధ్యక్షతన శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్ మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కుర్రి సైదయ్య మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుమారు 18 వేల మంది కార్మికులు చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 నుంచి 20 సంవత్సరాలుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జననం నుంచి మరణానంతరం మార్చురీ వరకు సేవలు అందిస్తున్న కార్మికులకు సరైన రక్షణ పరికరాలు, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. 2022 జీవో నెం.60 ప్రకారం కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలు పూర్తిగా అందడం లేదని, కాంట్రాక్టు ఏజెన్సీలు కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి, అన్ని కార్మికులను IFMISలో విలీనం చేసి నెలకు రూ.26 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్ సిబ్బందితో పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో SPS రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాతంగి అనిల్ కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉబ్బ రమణక్క, భద్రాద్రి కొత్తగూడెం హాస్పిటల్ అధ్యక్షుడు అనిల్, కొత్తగూడెం మెడికల్ కాలేజీ అధ్యక్షుడు శ్రావణ్, GGH సహాయ కార్యదర్శులు డి. గంగా, పవన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రి SPS నూతన కమిటీని ప్రకటించారు. గౌరవాధ్యక్షుడిగా సిద్ధెల తిరుమలరావు, అధ్యక్షుడిగా చెన్నం వీరస్వామి, ప్రధాన కార్యదర్శిగా కోనేటి స్వాతి, కోశాధికారిగా కేదార్‌తో పాటు ఇతర కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.