టీడబ్ల్యూజేఎఫ్ సంఘాన్ని చీల్చే ప్రయత్నాలు ఫలించవు
టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ మెంబర్ బుడిగె మల్లేష్
వరంగల్ జులై15 (నమస్తే భారత్ ) :
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీబ్ల్యూజేఎఫ్ ) గత 16 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న ఏకైక ఉద్యమ సంఘం అని టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ మెంబర్ బుడిగె మల్లేష్ అన్నారు.ఈసందర్భంగా మీడియాతో అయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల కోసం ఎన్నో ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు నిర్వహించి ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లింది. ఐఅండ్ పీఆర్ కార్యాలయం ముట్టడి, ఛలో అసెంబ్లీ, సచివాలయం ముట్టడి- అరెస్టులు, కలెక్టరేట్‌ల వద్ద నిరసనలు వంటి ఆందోళన కార్యక్రమాలు ఇటీవల చేపట్టి ఇప్పుడు 27న”ఛలో పార్లమెంట్” కార్యక్రమం చేపట్టబోతుందన్నారు. ఈ ఉద్యమాలన్నీ కూడా పోరాట స్ఫూర్తితో చేపట్టిన కార్యక్రమాలేనన్నారు.
అయితే ఇటీవల సంఘం నుంచి క్రమశిక్షణా చర్యల నేపథ్యంలో బహిష్కరణకు గురైన కొందరు వ్యక్తులు, తమ ఉనికిని చాటుకునేందుకు టీడబ్ల్యూజేఎఫ్ చేపట్టిన కార్యక్రమాలనే అనుకరిస్తూ జర్నలిస్టుల్లో అయోమయం సృష్టించే ప్రయత్నం చేయడం బాధాకరం. సంఘం పేరును పోలిన పేర్లతో, అదే తరహా కార్యక్రమాలను ప్రకటించడం ద్వారా జర్నలిస్టులను గందరగోళానికి గురిచేయడం సరైన విధానం కాదు.ఎవరైనా కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం వారి హక్కు. తమ సిద్ధాంతాలతో, తమ కార్యాచరణతో జర్నలిస్టుల మద్దతు సంపాదించుకోవచ్చు. కానీ గత 16 సంవత్సరాలుగా వేలాది మంది జర్నలిస్టుల విశ్వాసంతో ఎదిగిన టీడబ్ల్యూజేఎఫ్ ను బలహీనపర్చేందుకు లేదా విభజించేందుకు చేసే ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవు అని అన్నారు.
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అనేది మామిడి సోమయ్య నాయకత్వంలో కొనసాగుతున్న అధికారిక సంఘం. ఈ సంఘం భారతదేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన “ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్” ( టీడబ్ల్యూజేఎఫ్ ) కు అధికారిక అనుబంధంగా కొనసాగుతోంది. ఈ వాస్తవాన్ని ఎలాంటి తప్పుడు ప్రచారాలు మార్చలేవు అని తెలిపారు.
సంఘంలో బాధ్యతలు నిర్వహించిన కొందరు వ్యక్తులు, సంఘం రాజ్యాంగానికి విరుద్ధంగా అధ్యక్షుడి స్థానంలో యాక్టింగ్ ప్రసిడెంట్ ను పెట్టి యాక్టింగ్ చేయడం, వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడం, సంఘ నిర్ణయాలను ధిక్కరించడం వంటి కారణాలతో క్రమశిక్షణా చర్యలకు గురయ్యారు. అనంతరం అదే వ్యక్తులు సంఘం పేరును ఉపయోగిస్తూ ప్రత్యామ్నాయ కార్యక్రమాలు ప్రకటించడం జర్నలిస్టుల్లో అయోమయాన్ని కలిగించే ప్రయత్నమే తప్ప, జర్నలిస్టుల ప్రయోజనాలకు ఉపయోగపడేది కాదు అని అన్నారు. టీడబ్ల్యూజేఎఫ్
లో కష్టపడి పనిచేసే ప్రతి జర్నలిస్టుకు తగిన గుర్తింపు లభిస్తుంది. సంఘం కోసం నిజాయితీగా శ్రమించిన వారిని ప్రోత్సహించడం మా సంప్రదాయం. వ్యక్తిగత అభిరుచులు, వర్గపోకడలు లేదా ఏ ఒక్క మీడియా సంస్థకు ప్రాధాన్యం ఇచ్చే విధానం మా సంఘంలో లేదు. సమిష్టి ప్రయోజనాలే మా లక్ష్యం అని చెప్పారు.
ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రతినిధులు హాజరుకావడం, సంఘంపై జర్నలిస్టుల విశ్వాసానికి నిదర్శనం. త్వరలో జరగనున్న రాష్ట్ర మహాసభ కూడా అదే ఐక్యతను మరింత బలపరుస్తుంది అని అన్నారు.కాబట్టి జర్నలిస్టు మిత్రులు ఎలాంటి దుష్ప్రచారాలను నమ్మకుండా, అధికారికంగా టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ గారి పేర్లతో విడుదలయ్యే ప్రకటనలనే అధికారికంగా పరిగణించాలి అని తెలిపారు.సంఘాన్ని చీల్చే ప్రయత్నాలు తాత్కాలికమే. కానీ జర్నలిస్టుల ఐక్యత శాశ్వతం. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జర్నలిస్టుల హక్కుల కోసం గతంలో ఎలా పోరాడిందో, భవిష్యత్తులో కూడా అదే నిబద్ధతతో ముందుకు సాగుతుంది. సంఘం ఐక్యతే మా బలం… జర్నలిస్టుల హక్కుల పరిరక్షణే మా ధ్యేయంగా టీడబ్ల్యూజేఎఫ్ సంఘం పని చేస్తుందన్నారు.