NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 9:21 pm Posted by : NAMASTHE BHARAT

హత్య చేసి ఆనవాళ్లు చెరిపే యత్నం… నిందితుడికి యావజ్జీవం

హత్య చేసి ఆనవాళ్లు చెరిపే యత్నం… నిందితుడికి యావజ్జీవం

-జీడిమెట్ల పోలీసుల పకడ్బందీ దర్యాప్తుకు న్యాయస్థానం ప్రశంసనీయ ముద్ర

-302, 436, 201 ఐపీసీ సెక్షన్ల కింద నిందితుడు భునేశ్వర్ సింగ్ దోషిగా నిర్ధారణ

-మెడ్చల్–II అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు సంచలన తీర్పు

-హత్య అనంతరం నిప్పంటించి ఆధారాలు చెరిపివేయాలన్న కుట్ర బట్టబయలు

-దర్యాప్తు అధికారులు–ప్రాసిక్యూషన్ సమన్వయంతో బాధిత కుటుంబానికి న్యాయం

-నేరస్తులకు కఠిన హెచ్చరికగా నిలిచిన కోర్టు తీర్పు

జీడిమెట్ల, జులై 20 ( నమస్తే భారత్ ): జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగేళ్ల క్రితం నమోదైన సంచలన హత్య కేసులో మెడ్చల్–II అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. పి.ఎస్. జీడిమెట్ల క్రైమ్ నెం.613/2022, ఐపీసీ సెక్షన్లు 302, 436, 201 కింద నమోదైన కేసు (ఎస్.సి. నెం.297/2023)లో నిందితుడు భునేశ్వర్ సింగ్ (46)ను అన్ని అభియోగాల్లో దోషిగా నిర్ధారిస్తూ న్యాయమూర్తి జి. భానుమతి సోమవారం తీర్పు ప్రకటించారు. విచారణలో సమర్పించిన ప్రత్యక్ష, పరోక్ష సాక్ష్యాలు, శాస్త్రీయ ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను సమగ్రంగా పరిశీలించిన న్యాయస్థానం నిందితుడే హత్యకు పాల్పడి, అనంతరం నిప్పంటించి నేర ఆనవాళ్లను చెరిపివేయడానికి ప్రయత్నించినట్లు నిర్ధారించింది. దీంతో చట్ట ప్రకారం కఠిన శిక్షలు విధించింది. న్యాయస్థానం ఐపీసీ సెక్షన్ 302 కింద నిందితుడికి యావజ్జీవ కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల సాధారణ కారాగార శిక్ష అనుభవించాలని ఆదేశించింది. అదే విధంగా సెక్షన్ 436 కింద 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా, జరిమానా చెల్లించని పక్షంలో ఒక నెల సాధారణ కారాగార శిక్ష విధించింది. అలాగే సెక్షన్ 201 కింద మూడు నెలల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.500 జరిమానా, జరిమానా చెల్లించని పక్షంలో మరో నెల సాధారణ కారాగార శిక్షను ఖరారు చేసింది. ఈ కేసు దర్యాప్తును సబ్ఇన్‌స్పెక్టర్లు కె. గౌతమ్, ఎ. హరీష్ ప్రారంభించి, అనంతరం ఇన్‌స్పెక్టర్ ఎం. పవన్ సమర్థవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం జీడిమెట్ల ఎస్‌హెచ్ఓగా విధులు నిర్వహిస్తున్న కె. రవి కుమార్ పర్యవేక్షణలో కేసు విచారణ విజయవంతంగా పూర్తయింది. కోర్టులో ప్రభుత్వ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి. విజయ్ రెడ్డి బలమైన వాదనలు వినిపించారు. సమన్స్ సిబ్బంది బి. నాగరాజు, బి. సత్తయ్య, వెంకటేష్, సీడీఓ జె. శ్రీనివాస్, లియాజన్ అధికారి ఎం. ఓబులమ్మ కేసు నిర్వహణలో సమర్థవంతమైన సమన్వయం అందించారు. ఈ తీర్పుతో హత్య చేసి ఆధారాలను నాశనం చేయాలని ప్రయత్నించినా చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరనే స్పష్టమైన సందేశాన్ని న్యాయస్థానం సమాజానికి ఇచ్చిందని న్యాయవర్గాలు, పోలీసు అధికారులు పేర్కొన్నారు. జీడిమెట్ల పోలీసుల శాస్త్రీయ దర్యాప్తు, పటిష్ఠమైన సాక్ష్యాధారాల సేకరణ, ప్రాసిక్యూషన్ సమర్థవంతమైన వాదనల ఫలితంగానే నిందితుడికి కఠిన శిక్షలు ఖరారయ్యాయని వారు అభిప్రాయపడ్డారు.