NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 11:58 am Posted by : NAMASTHE BHARAT

ఓటరు జాబితా ప్రత్యేక సవరణకు వేగం పెంచండి బీఎల్ఓలకు జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశాలు

ఓటరు జాబితా ప్రత్యేక సవరణకు వేగం పెంచండి బీఎల్ఓలకు జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశాలు

 

-ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణలో నిర్లక్ష్యానికి తావులేదన్న కలెక్టర్

-ఓటర్ల సందేహాలు నివృత్తి చేస్తూ పూర్తి అవగాహన కల్పించాలని సూచన

-స్వీకరించిన ఫారాలను వెంటనే డిజిటలీకరణ చేయాలని ఆదేశం

-అందుబాటులో లేని ఓటర్ల వివరాలను వెంటనే ఉన్నతాధికారులకు అందజేయాలని సూచన

-సుభాష్‌నగర్, కోంపల్లిలో ప్రత్యేక సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్

-రోజువారీ లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని బీఎల్ఓలకు స్పష్టమైన దిశానిర్దేశం

కుత్బుల్లాపూర్, జూలై 13 ( నమస్తే భరత్ ): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి బూత్ స్థాయి అధికారులకు ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేయడంతో పాటు, పూరించిన ఫారాలను సకాలంలో స్వీకరించి ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. సోమవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్‌నగర్ వార్డు కార్యాలయంలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులతో సమావేశమై పనితీరును సమీక్షించారు. ప్రతి ఫారాన్ని జాగ్రత్తగా పరిశీలించి, ఓటర్లకు ఎదురయ్యే సందేహాలను వెంటనే నివృత్తి చేస్తూ సరైన అవగాహన కల్పించాలని సూచించారు. స్వీకరించిన ఫారాలను ఆలస్యం చేయకుండా వెంటనే డిజిటలీకరణ చేయాలని, అందుబాటులో లేని ఓటర్ల వివరాలను సంబంధిత పర్యవేక్షణ అధికారులకు తక్షణమే అందించాలని ఆదేశించారు. రోజువారీ లక్ష్యాలను వంద శాతం పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని బూత్ స్థాయి అధికారులకు స్పష్టం చేశారు. అనంతరం కోంపల్లిలో కొనసాగుతున్న ఎన్యుమరేషన్, డిజిటలీకరణ ప్రక్రియలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అక్కడికి వచ్చిన ఓటర్లతో నేరుగా మాట్లాడి వారి సందేహాలను తెలుసుకొని, ఫారాలను సరైన విధంగా పూరించే అంశంపై అవగాహన కల్పించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ప్రతి దశను నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా నిర్వహించి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.