NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 9:45 pm Posted by : NAMASTHE BHARAT

ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయండి

ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయండి

-ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణలో బీఎల్‌వోలు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలి

-ఓటర్లకు సందేహాల నివృత్తితో పాటు పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశం

-స్వీకరించిన ఫారాలను వెంటనే డిజిటలైజ్ చేయాలని సూచనలు

-అందుబాటులో లేని ఓటర్ల వివరాలను సూపర్వైజర్లకు అందజేయాలని నిర్దేశం

-అల్వాల్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మను చౌదరి

-రోజువారీ లక్ష్యాలను సమర్థవంతంగా పూర్తి చేయాలని బీఎల్‌వోలకు దిశానిర్దేశం

కుత్బుల్లాపూర్, జూలై 17 ( నమస్తే భారత్ ): ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి బూత్ లెవల్ అధికారులకు (బీఎల్‌వోలు) సూచించారు. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ ప్రక్రియను పూర్తి బాధ్యతతో నిర్వహిస్తూ ప్రతి అర్హ ఓటరికి సేవలు అందించాలని ఆదేశించారు. శుక్రవారం అల్వాల్ మండలంలోని 9వ నంబర్ పోలింగ్ స్టేషన్ వద్ద కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్‌వోలతో మాట్లాడిన ఆయన, ఫారాల పంపిణీతో పాటు పూరించిన దరఖాస్తులను సకాలంలో స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫారాలు పూరించే సమయంలో ఓటర్లకు ఎదురయ్యే సందేహాలను వెంటనే నివృత్తి చేస్తూ, వారికి సరైన అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యవంతమైన విధానంలో ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. స్వీకరించిన ఎన్యుమరేషన్ ఫారాలను ఆలస్యం చేయకుండా వెంటనే డిజిటలైజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. డిజిటలైజేషన్ ప్రక్రియ ఎలా కొనసాగుతోందో కలెక్టర్ స్వయంగా పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఇళ్లలో అందుబాటులో లేని ఓటర్ల వివరాలను సంబంధిత సూపర్వైజర్లకు వెంటనే తెలియజేయాలని బీఎల్‌వోలకు సూచించారు. రోజువారీ లక్ష్యాలను సమయానికి పూర్తి చేస్తూ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సలహాలు, మార్గదర్శకాలను అందించారు. జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్దేశిత గడువులో పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ మను చౌదరి స్పష్టం చేశారు.