NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 11:52 am Posted by : NAMASTHE BHARAT

చిన్నారుల ఆరోగ్యానికి రక్షణ కవచం… జిల్లాలో అల్బెండజోల్ పంపిణీ ప్రారంభం

చిన్నారుల ఆరోగ్యానికి రక్షణ కవచం… జిల్లాలో అల్బెండజోల్ పంపిణీ ప్రారంభం

-నాగారం జెడ్పీహెచ్ఎస్‌లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమానికి శ్రీకారం

-డీఎంహెచ్ఓ డా. ఆనంద్ చేతుల మీదుగా విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రల పంపిణీ

-1 నుంచి 19 ఏళ్ల పిల్లలు, యువతకు పాఠశాలలు, అంగన్‌వాడీల ద్వారా మందుల పంపిణీ

-జిల్లాలో తొలి రోజే 91 శాతం మంది పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ

-జూలై 20న మాప్-అప్ డే నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు

-ఆరోగ్య, విద్య, మహిళా శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో విజయవంతమైన కార్యక్రమం

కుత్బుల్లాపూర్, జులై 13 ( నమస్తే భరత్ ); చిన్నారులు, యువత ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు నులిపురుగుల నివారణ అత్యంత కీలకమని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డా. ఆనంద్ పేర్కొన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ–2026 సందర్భంగా సోమవారం నాగారం జెడ్పీహెచ్ఎస్‌లో విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు అందజేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డా. ఆనంద్ మాట్లాడుతూ, జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, యువతకు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, అలాగే సమాజ స్థాయిలో అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నులిపురుగుల నివారణ ద్వారా పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం తగ్గి, శారీరక ఎదుగుదలతో పాటు మేధో వికాసం మెరుగుపడుతుందని వివరించారు. తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా తమ పిల్లలకు తప్పనిసరిగా మాత్రలు వేయించాలని సూచించారు. చిన్నారుల వయస్సును బట్టి అల్బెండజోల్ మాత్రలను అందించాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. 1–2 సంవత్సరాల పిల్లలకు అర మాత్రను పొడి చేసి నీటితో, 2–3 సంవత్సరాల పిల్లలకు పూర్తి మాత్రను పొడి చేసి నీటితో ఇవ్వాలని, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు మాత్రను నమిలి మింగేలా చూడాలని తెలిపారు. మొదటి రోజు కార్యక్రమంలో పాల్గొనలేకపోయిన పిల్లల కోసం జూలై 20న మాప్-అప్ డే నిర్వహించి, ఒక్క చిన్నారి కూడా మిగలకుండా అల్బెండజోల్ మాత్రలను అందజేస్తామని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో తొలి రోజే లక్ష్యానికి అనుగుణంగా 91 శాతం మంది పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారికి మాప్-అప్ కార్యక్రమం ద్వారా మందులు అందించి లక్ష్యాన్ని పూర్తిగా సాధించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారి డా. శ్రీదేవి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. గీత, వైద్యాధికారి డా. మనుజ, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య, విద్య, మహిళా శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.