ప్రతి ఇంటికీ బీపీ, షుగర్ పరీక్షలు.మధుమేహ బాధితులకు ఉచిత ఇన్సులిన్ అందించాలి
ఎం.డి. అబ్దుల్ రషీద్
సీపీఐ జిల్లా సమితి సభ్యులు
నమస్తే భారత్ :-మరిపెడ
ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతూ మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ రవి కి సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో బీపీ, షుగర్ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని, ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ వ్యాధుల చికిత్స ఆర్థిక భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కోరారు.మరిపెడ మండలంలోని అన్ని గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజలకు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించాలని, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేశారు.టైప్-1, టైప్-2 మధుమేహంతో బాధపడుతున్న వారికి వైద్యుల సూచనల మేరకు ఉచితంగా మందులు, ఇన్సులిన్ ఇంజెక్షన్లు అందించాలని కోరారు. ముఖ్యంగా టైప్-1 డయాబెటిస్తో.బాధపడుతున్న చిన్నారులు, యువతకు ఇన్సులిన్ నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్సులిన్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా ప్రతి పల్లె దవాఖానాలో షుగర్ పరీక్షా కిట్లు, బీపీ పరీక్షా పరికరాలు, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, వైద్య సిబ్బంది గ్రామాల్లో క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని కోరారు. వ్యాధిగ్రస్తులకు ఆహార నియమాలు, వ్యాయామం, మందుల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ప్రజారోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని, పేద ప్రజలు డబ్బులేక వైద్యానికి దూరమయ్యే పరిస్థితి రాకుండా ఉచిత వైద్య సేవలను మరింత విస్తరించాలని అన్నారు.
ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ రవి కి వినతిపత్రం అందజేసి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.



