NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 2:17 pm Posted by : NAMASTHE BHARAT

వర్షపు నీటిని ఒడిసిపట్టడమే భూగర్భ జలాలకు భరోసా

వర్షపు నీటిని ఒడిసిపట్టడమే భూగర్భ జలాలకు భరోసా

మొతినగర్‌లో ఇంకుడు గుంతలపై అవగాహన కార్యక్రమం

ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని పిలుపు

వాన నీటిని భూమిలోకి మళ్లిస్తే బోర్లలో నీటి లభ్యత పెరుగుతుంది

వరదల నివారణకు, నీటి సంరక్షణకు సమర్థ మార్గం
పోస్టర్ ఆవిష్కరించిన సేవ్ సంస్థ అధినేత విజయరామ్

కుత్బుల్లాపూర్, జూన్ 13 ( నమస్తే భరత్ ): రోజురోజుకూ పడిపోతున్న భూగర్భ జల మట్టాలను కాపాడుకోవాలంటే వర్షపు నీటిని వృథా కాకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టడం అత్యవసరమని నీటి సంరక్షణ నిపుణులు సూచించారు. ఈ నేపథ్యంలో మొతినగర్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో “ఇంకుడు గుంతలు తవ్వండి – వర్షపు నీటిని ఒడిసిపట్టండి” అనే నినాదంతో రూపొందించిన పోస్టర్‌ను సేవ్ సంస్థ అధినేత విజయరామ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వర్షపు నీటి సంరక్షణ వల్ల భవిష్యత్ తరాలకు తాగునీటి భద్రత కల్పించవచ్చని వక్తలు పేర్కొన్నారు. ప్రతి ఇంటి ఆవరణలో, కాలనీల్లో వర్షపు నీరు పారిపోయే ప్రాంతాల్లో సుమారు మూడు అడుగుల వెడల్పు, నాలుగు నుంచి ఆరు అడుగుల లోతుతో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని సూచించారు. గుంతలను కంకర, ఇసుక, ఇటుక ముక్కలతో నింపడం ద్వారా వర్షపు నీరు వేగంగా భూమిలోకి ఇంకి భూగర్భ జలాలను పునరుద్ధరిస్తుందని వివరించారు. వానాకాలం ప్రారంభానికి ముందే ఇంకుడు గుంతల నిర్మాణాన్ని పూర్తి చేస్తే బోర్లు, బావుల్లో నీటి లభ్యత పెరగడంతో పాటు వర్షాల సమయంలో నీటి నిల్వలు, స్థానిక వరదల సమస్య కూడా తగ్గుతుందని తెలిపారు. నీటి సంరక్షణను ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా భావించి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రముఖ సామాజికవేత్త, పర్యావరణ పరిరక్షణ సమితి చైర్మన్ లయన్ అన్నెం కోటిరెడ్డి మాట్లాడుతూ, నీటి వనరుల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని అన్నారు. ప్రతి కుటుంబం కనీసం ఒక ఇంకుడు గుంతను నిర్మించి వర్షపు నీటిని భూమిలోకి మళ్లించేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో నీటి సంరక్షణపై చైతన్యం పెంపొందించి, భూగర్భ జలాల పరిరక్షణకు సామూహిక కృషి అవసరమని కార్యక్రమంలో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు.