NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 7:44 pm Posted by : NAMASTHE BHARAT

మట్టిలో మాణిక్యాలు… ఘన విజయాలు

మట్టిలో మాణిక్యాలు… ఘన విజయాలు

ప్రభుత్వ కళాశాలలకు దిక్సూచిగా కె.ఎం. పాండు మెమోరియల్ వోకేషనల్ జూనియర్ కళాశాల
ఇంటర్ ఫలితాల్లో ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ప్రతిభ.. మెరిసిన నిరుపేద విద్యార్థులు
టాపర్లను సత్కరించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
కుత్బుల్లాపూర్, జూన్ 10 ( నమస్తే భరత్ ): పేదరికం ప్రతిభకు అడ్డుకాదని మరోసారి నిరూపించారు కె.ఎం. పాండు మెమోరియల్ గవర్నమెంట్ వోకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు. నాణ్యమైన విద్య, ఉపాధి ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబర్చి ప్రైవేట్ కళాశాలలకు ఏమాత్రం తీసిపోమని చాటిచెప్పారు. అత్యుత్తమ ఫలితాలతో ప్రభుత్వ విద్యాసంస్థలకు ఆదర్శంగా నిలుస్తూ ఇతర కళాశాలలకు దిక్సూచిగా మారింది.

నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యే లక్ష్యం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన వృత్తి విద్య అందించాలనే సంకల్పంతో బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తన తండ్రి కె.ఎం. పాండు జ్ఞాపకార్థం స్వంత నిధులతో ఈ కళాశాలను నిర్మించారు. 2023 ఆగస్టు 17న ప్రారంభమైన ఈ కళాశాల తొలి విద్యా సంవత్సరంలో 368 మంది విద్యార్థులతో ప్రారంభమై, ప్రస్తుతం 2025-26 విద్యా సంవత్సరానికి 926 మంది విద్యార్థులతో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది.

ఉపాధి కల్పనకు దోహదపడే వినూత్న కోర్సులు
విద్యతో పాటు ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో కళాశాలలో సాధారణ కోర్సులతో పాటు పలు వృత్తి విద్యా కోర్సులను అందిస్తున్నారు. బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, హెచ్ఈసీ కోర్సులతో పాటు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఎంపీహెచ్‌డబ్ల్యూ), మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (ఎంఎల్‌టీ), కంపెనీ సెక్రటరీ (సీఎస్), ఎలక్ట్రికల్ టెక్నీషియన్ (ఈటీ), ఫార్మా టెక్నాలజీ వంటి ఉపాధి ప్రధాన కోర్సులు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. గత విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఫార్మా టెక్నాలజీ కోర్సులో 98 శాతం ఫలితాలు నమోదవడం విశేషం.

అద్భుత ఫలితాలతో మెరిసిన విద్యార్థులు
2026 విద్యా సంవత్సరంలో పలువురు విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి కళాశాలకు కీర్తి తెచ్చారు. ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులో జి. భాగ్యశ్రీ – 981, ఎంఎల్‌టీలో కె. పూజిత – 970, కంపెనీ సెక్రటరీలో ఏ. అక్షయ, టీ. రోషిణి – 966, ఎలక్ట్రికల్ టెక్నీషియన్‌లో ఎం. లిఖిత – 943, పి. శ్రీహరి – 936, ఎంపీసీ-2లో పి. జోష్ణ – 981, వి. వర్షిత – 951, వడ్ల వర్షిత – 940, బైపీసీ-1లో వాలియా జబీన్ – 428/470, సీఈసీ-2లో బి. సంజన – 839, హెచ్ఈసీ-2లో కె. మాలతి – 882 మార్కులు సాధించారు.

టాపర్లకు ఎమ్మెల్యే సత్కారం
ఉత్తమ ఫలితాలు సాధించి ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన విద్యార్థులను బుధవారం కుత్బుల్లాపూర్‌లోని తన నివాస కార్యాలయంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ శాలువాలతో సత్కరించి అభినందించారు.

‘విద్యతోనే జీవితంలో వెలుగు’
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ, విద్య ద్వారానే అజ్ఞానాన్ని రూపుమాపి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చనే విశ్వాసంతో తన తండ్రి కె.ఎం. పాండు ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. నిరుపేద విద్యార్థులకు ఉపాధి కల్పనతో కూడిన నాణ్యమైన విద్య అందించడమే కళాశాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు ఇదే కృషితో ఉన్నత విద్యను అభ్యసించి ఉజ్వల భవిష్యత్తు నిర్మించుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపడతామని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు, సిబ్బంది సౌకర్యార్థం కళాశాల వద్ద బస్టాప్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉపాధి ప్రధాన కోర్సులను ప్రారంభించేందుకు తన పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ షేక్ మైమూన్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నాగేందర్, కళాశాల సిబ్బంది, వెలుగు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు నారాయణరావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.