NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 2:48 pm Posted by : NAMASTHE BHARAT

భద్రాద్రి‘జలనిధి’..రోళ్ళపాడు‘ద్వీప’సిరి గిరిజన పల్లెల్లో పర్యాటక విప్లవం!

భద్రాద్రి‘జలనిధి’..రోళ్ళపాడు‘ద్వీప’సిరి గిరిజన పల్లెల్లో పర్యాటక విప్లవం!

నమస్తేభారత్:టేకులపల్లి,జూన్ 14

-అటు రైతన్నలు.. ఇటు పర్యాటకులు.. మధ్యలో మత్స్యకారుల సిరులు!
-సీతారామ ప్రాజెక్టు పూర్తితో మారనున్న టేకులపల్లి ముఖచిత్రం
-రోళ్ళపాడును పర్యాటక కేంద్రంగా మార్చాలని గ్రామస్తుల ఏకగ్రీవ డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,టేకులపల్లి మండలంలోని రోళ్ళపాడు గ్రామపంచాయతీ పరిధిలో ప్రకృతి ప్రసాదించిన అపురూప వరప్రసాదమైన ‘రోళ్ళపాడు ద్వీపం’నేడు అన్వేషించని ఒక పర్యాటక వజ్రంలా మెరుస్తోంది.ప్రతిష్టాత్మక ‘సీతారామ ఎత్తిపోతల పథకం’జలాల కలయికతో ఈ ప్రాంతం సరికొత్త జలకళను సంతరించుకుంది.దట్టమైన అరణ్యం,చుట్టూ స్వచ్ఛమైన జలరాశి,మధ్యలో ఆకుపచ్చని ద్వీపంతో అలరారుతున్న ఈ ప్రాంతాన్ని గనుక ప్రభుత్వం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే అటు రైతాంగానికి,ఇటు మత్స్యకారులకు మరియు స్థానిక గ్రామస్తులకు ఒక అద్భుతమైన ఆర్థిక వరప్రసాదంగా మారనుంది.

మత్స్యకారులకు అండగా-ఇప్పటికే సాగుతున్న చేపల పెంపకం:

రోళ్ళపాడు జలాశయం ఇప్పటికే మత్స్యకారులకు జీవనాధారంగా నిలిచింది.ఇక్కడ ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్న చేపల పెంపకం ద్వారా ఎన్నో కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి.రాబోయే రోజుల్లో సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు ఇక్కడికి పూర్తి స్థాయిలో చేరుకుంటే,నీటి నిల్వ సామర్థ్యం మరింత పెరిగి మత్స్య సంపద రెట్టింపు అవుతుంది.దీనివల్ల స్థానిక మత్స్యకార సొసైటీలకు,గిరిజన కుటుంబాలకు చేతినిండా పని దొరికి,ఆర్థికంగా మరింత బలోపేతం కానున్నారు.

రైతాంగానికి సుజల స్రవంతి – పంటల పండుగ:

ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడం టేకులపల్లి మండల రైతాంగం పాలిట కల్పవృక్షం కానుంది.ఎడారిని తలపించే మెట్ట భూములు సైతం గోదావరి జలాలతో తడిసి ముద్దవుతాయి.ఏటా రెండు పంటలు సమృద్ధిగా పండించుకునే అవకాశం లభించడమే కాకుండా,పరివాహక ప్రాంతంలో భూగర్భ జలమట్టం భారీగా పెరుగుతుంది.బావులు,వాగులు ఎల్లప్పుడూ నిండుకుండలా మారడం వల్ల రైతుల దశాబ్దాల సాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరిపోతాయి.

పర్యాటకులకు స్వర్గధామం-గ్రామస్తులకు శాశ్వత ఆదాయం:

రోళ్ళపాడు ద్వీపాన్ని ఒక అధికారిక పర్యాటక కేంద్రంగా మార్చడం వల్ల గ్రామస్తుల ఆర్థిక వ్యవస్థ రూపురేఖలే మారిపోతాయి.పర్యాటకుల ద్వారా వచ్చే ప్రవేశ రుసుము,పార్కింగ్ ఛార్జీలతో గ్రామపంచాయతీకి శాశ్వత ఆదాయం సమకూరుతుంది.ఈ నిధులతో గ్రామంలో అంతర్గత సిమెంట్ రోడ్లు,తాగునీరు,హైటెక్ పారిశుద్ధ్య పనులను సొంతంగానే అద్భుతంగా నిర్వహించుకోవచ్చు.వందలాది గిరిజన యువతకు బోటింగ్ నిర్వహణ,టూరిస్ట్ గైడ్‌లుగా స్థానికంగానే ఉపాధి లభిస్తుంది.గిరిజన మహిళలు సేకరించే స్వచ్ఛమైన తేనె,హస్తకళలతో పాటు స్థానిక రైతులు పండించే తాజా కూరగాయలు,పండ్లను పర్యాటకులకు నేరుగా అమ్ముకునే వీలుంటుంది.దీనివల్ల రైతులకు దళారీల బాధ తప్పుతుంది.రోళ్ళపాడుకు నీరందించే సీతారామ కాలువల పనులను,ప్రాజెక్టు మిగిలిన నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి.అటవీ మార్గం గుండా రోళ్ళపాడుకు చేరుకునే దారిని తక్షణమే పక్కా బి.టిరహదారిగా మార్చాలి.ఇది పర్యాటకులతో పాటు,రైతులు తమ పంటలను,మత్స్యకారులు తాము పట్టిన చేపలను మార్కెట్‌కు త్వరగా తరలించడానికి ఎంతో ఉపయోగపడుతుంది.పర్యావరణానికి ఎలాంటి ముప్పు కలగకుండా ద్వీపంపై వెదురు పొదలతో కాటేజీలు,వాటర్ స్పోర్ట్స్ మరియు సురక్షితమైన వ్యూ పాయింట్లను ఏర్పాటు చేయాలి.రోళ్ళపాడు ద్వీపం మరియు సీతారామ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే,అది కేవలం ఒక సాధారణ సందర్శనీయ స్థలంగా మాత్రమే మిగిలిపోదు.అది టేకులపల్లి మండలంలోని వందలాది గిరిజన కుటుంబాల జీవితాల్లో,వేలాది మంది రైతుల ఇళ్లల్లో సరికొత్త వెలుగులు నింపే ఒక గొప్ప ఆశాదీపం.ఒకవైపు పచ్చని పంటలు…మరోవైపు పరవళ్లు తొక్కే పర్యాటకం…వెరసి టేకులపల్లి మండలంలో ఒక గొప్ప ఆర్థిక,వ్యవసాయ విప్లవం రావడం ఖాయం.ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.

 

“నా దృష్టిలో అభివృద్ధి అంటే కేవలం కాంక్రీటు కట్టడాలు కాదు…ప్రకృతిని కాపాడుకుంటూనే మనిషికి ఉపాధిని చూపడం.రోళ్ళపాడుకు ఆ శక్తి ఉంది.అభివృద్ధి అనేది మన ముంగిట ఉన్నప్పుడు,దానిని అందిపుచ్చుకోవడంలో మనం వెనుకబడితే,అది మన ప్రాంతానికే కాదు…రేపటి తరానికి మనం చేసే అన్యాయం.ఒక సామాన్య పౌరుడిగా నేను కోరుకునేది ఒక్కటే..రోళ్ళపాడు అభివృద్ధి కేవలం ఫైళ్లకే పరిమితం కాకూడదు.అధికారులు,ప్రజాప్రతినిధులు కలిసి అడుగు వేస్తే,ఈ అడవిలోని అందం లోకానికి తెలుస్తుంది..మా పల్లె కన్నీళ్లు తుడువబడతాయి.మన గడ్డపై ఉన్న సంపదను మనమే కాపాడుకుందాం.. అభివృద్ధి పథంలో ముందుకు నడిపిద్దాం!”

చీమల రాము(రోళ్లపాడు వాసి)