బౌరంపేటలో రూ.కోటితో సీసీ రోడ్డు పనులు వేగవంతం
ప్రాధాన్యత క్రమంలో కుత్బుల్లాపూర్‌లో అన్ని ప్రాంతాల అభివృద్ధి

లహరి గ్రీన్ పార్క్ ప్రధాన రహదారిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం
పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనపై దృష్టి
పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

కుత్బుల్లాపూర్, జూన్ 13 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడతామని బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పేర్కొన్నారు. సీఎంసీ దుండిగల్ సర్కిల్ పరిధిలోని బౌరంపేట లహరి గ్రీన్ పార్క్‌లో సుమారు రూ.కోటి వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పెరుగుతున్న జనాభా, వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గత 12 సంవత్సరాలుగా కోట్లాది రూపాయల నిధులతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి వసతులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన ద్వారా నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. లహరి గ్రీన్ పార్క్ ప్రధాన రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రజల సహకారం ఎంతో అవసరమని, రానున్న రోజుల్లో కూడా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ మిద్దెల బాల్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు సునీత మురళీ యాదవ్, నర్సారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, టెర్రా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెలగపూడి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్‌రెడ్డి, సభ్యులు మురళి, ప్రశాంత్, కాటం శ్రీనివాస్, నాయకులు ఎస్వీ సురేందర్‌రెడ్డి, ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.