NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 12:34 pm Posted by : NAMASTHE BHARAT

ప్రభుత్వ భూమి ఆక్రమణ ఆరోపణలు.. ఫిరోజ్ ఖాన్‌పై కేసు

ప్రభుత్వ భూమి ఆక్రమణ ఆరోపణలు.. ఫిరోజ్ ఖాన్‌పై కేసు

గాజులరామారంలోని ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం చేపట్టినట్లు ఆరోపణలు

నిర్మాణం తొలగించేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులకు అడ్డంకులు

విధుల నిర్వహణలో ఆటంకం కలిగించారంటూ ఫిర్యాదు

బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

కుత్బుల్లాపూర్, జూన్ 12 ( నమస్తే భరత్ ): ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు నెహ్రూ నగర్‌కు చెందిన ఫిరోజ్ ఖాన్‌పై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. మండల రెవెన్యూ అధికారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సంబంధిత సెక్షన్ల కింద క్రైమ్ నంబర్ 558/2026గా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గాజులరామారం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 79లో ఉన్న ప్రభుత్వ భూమిని ఫిరోజ్ ఖాన్ అక్రమంగా ఆక్రమించి అక్కడ అనధికారిక నిర్మాణం చేపట్టినట్లు రెవెన్యూ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో జూన్ 11న సంబంధిత నిర్మాణాన్ని తొలగించేందుకు రెవెన్యూ అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అధికారుల చర్యలను ఫిరోజ్ ఖాన్ అడ్డుకున్నారని, వారి విధుల నిర్వహణకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా నిర్మాణాన్ని కూల్చివేస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తూ అధికారులను బెదిరించినట్లు ఆరోపించారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు ఆధారంగా ప్రభుత్వ అధికారులను వారి విధుల నిర్వహణలో అడ్డుకోవడం, బెదిరించడం తదితర ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని, దర్యాప్తు అనంతరం తదుపరి చర్యలు చేపడతామని పోలీసులు వెల్లడించారు.