
నమస్తే భారత్ షాద్ నగర్ జూన్11:పాలమూరు పట్టణంలోని పాలమూరు యూనివర్సిటీ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన బాలలహరి కరోకే ప్రోగ్రాం ఘన విజయాన్ని సాధించింది. చిన్నారుల్లో సంగీతాభిరుచిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది బాలబాలికలు పాల్గొని తమ గాన ప్రతిభను ప్రదర్శించారు.కార్యక్రమానికి హాజరైన స్వరాలహరి కల్చరల్ అకాడమీ అధ్యక్షులు నాయిని భాగన్న గౌడ్, డా. మేకల శ్రీనివాసులు, డీకే ఆంజనేయులు మాట్లాడుతూ చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహక బృందాన్ని వారు ప్రత్యేకంగా అభినందించారు.షాద్‌నగర్‌కు చెందిన స్వరరాగ సంగీత సుధా మ్యూజిక్ అకాడమీ తరఫున పాల్గొన్న విద్యార్థులు తమ అద్భుతమైన గాన ప్రతిభతో ప్రేక్షకులను అలరించారు. పోటీల్లో టి. భ్రమిణి ప్రథమ బహుమతి సాధించి అందరి ప్రశంసలు అందుకోగా, బి. వరలక్ష్మి తృతీయ బహుమతి గెలుచుకుని అకాడమీకి పేరు తీసుకొచ్చారు.విజేతలకు ముఖ్య అతిథి ఏపీ జితేందర్ రెడ్డి చేతుల మీదుగా నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సంగీతం, సాంస్కృతిక రంగాల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.అనంతరం షాద్ నగర్ స్వరరాగ సంగీత సుధా మ్యూజిక్ అకాడమీ గురువులు ప్రేమ్ రాజ్, సురేంద్ర్ విజేతలను మరియు పాల్గొన్న విద్యార్థులను సత్కరించి అభినందనలు తెలిపారు. విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకత్వం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు.