పారిశుధ్య సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ డీజీఎం శ్రీవాణిని కోరిన గుబ్బల లక్ష్మీనారాయణ, ఆలూరి వెంకట శేషాచారి
ఎస్సార్ నాయక్‌నగర్‌లో పగిలిన డ్రైనేజీ లైన్‌తో తీవ్ర ఇబ్బందులు..

త్వరలో సమస్య పరిష్కారానికి హామీ
కొంపల్లి, జూన్ 10 ( నమస్తే భరత్ ); ప్రతినిధి: కొంపల్లి సర్కిల్ పరిధిలోని కుత్బుల్లాపూర్ జోనల్ కార్యాలయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీవాణిని కలిసి పారిశుధ్య, డ్రైనేజీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్థానిక నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ, ఆలూరి వెంకట శేషాచారి విజ్ఞప్తి చేశారు. సుభాష్‌నగర్ డివిజన్‌లోని ఎస్సార్ నాయక్‌నగర్ ప్రాంతంలో ఇంటి నంబర్లు 5-247,248 సమీపంలో కొద్ది రోజుల క్రితం డ్రైనేజీ పైప్‌లైన్ పగిలిపోవడంతో మురుగునీరు రోడ్డుపైనే నిల్వ ఉండి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని వారు వివరించారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు, కాలనీవాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. ఈ సమస్యను స్థానికంగా నివసిస్తున్న ఎయిర్ ఫోర్స్ శ్రీనివాస్ దృష్టికి తీసుకురాగా, ఆయనతో పాటు సీనియర్ నాయకుడు గుబ్బల లక్ష్మీనారాయణ, ఎస్సార్ నాయక్‌నగర్ మాజీ అధ్యక్షుడు ఆలూరి వెంకట శేషాచారి, మాజీ అధ్యక్షుడు బొబ్బ ప్రసాద్ తదితరులు సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం సమస్య తీవ్రతను డీజీఎం శ్రీవాణి దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని కోరారు. వారి వినతికి స్పందించిన శ్రీవాణి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిశీలించి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే పగిలిన డ్రైనేజీ లైన్ స్థానంలో కొత్త పైప్‌లైన్ ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామని తెలిపారు. అదేవిధంగా కొంపల్లి పరిధిలోని మరికొన్ని ప్రాంతాల్లో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను కూడా నాయకులు ఆమె దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని శ్రీవాణి హామీ ఇచ్చినట్లు తెలిపారు. స్థానిక ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకుని పారిశుధ్య పరిస్థితులను మెరుగుపర్చాలని వారు విజ్ఞప్తి చేశారు.