NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 11:31 am Posted by : NAMASTHE BHARAT

నిజమైన కార్మికులను ప్రభుత్వం గుర్తించాలి

నిజమైన కార్మికులను ప్రభుత్వం గుర్తించాలి

-కార్మిక సంఘం సభ్యత్వ నమోదులో

-సీఐటీయూ జిల్లా నాయకులు కొండ ఉప్పలయ్య

నమస్తే భారత్ :-మరిపెడ

కార్మికుల శ్రమతో ఏర్పడిన సంక్షేమ నిధులను నిజమైన భవన నిర్మాణ కార్మికులకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నకిలీ కార్మికుల పేర్లతో లేబర్ కార్డులు పొందుతున్న వారిని గుర్తించి అరికట్టాలని భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయూ అనుబంధం) జిల్లా నాయకులు కొండ ఉప్పలయ్య డిమాండ్ చేశారు.శుక్రవారం మరిపెడ మండలంలోని అబ్బాయిపాలెం గ్రామంలో నిర్వహించిన భవన నిర్మాణ కార్మికులు మరియు ఇతర అసంఘటిత రంగ కార్మికుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు సమాజ అభివృద్ధికి కీలకమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.కార్మికుల నుంచి వసూలు చేస్తున్న సంక్షేమ నిధులను ఇతర రంగాలకు మళ్లించడం వల్ల కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. కార్మిక శాఖకు చెందిన నిధులను పూర్తిగా కార్మికుల సంక్షేమానికే వినియోగించాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం చేపట్టే పోరాటాల్లో ప్రతి కార్మికుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.
భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు ప్రమాదాలు, ఉపాధి అభద్రత, కనీస వేతనాల అమలు లేకపోవడం, ఆరోగ్య
సదుపాయాల కొరత, సామాజిక భద్రత లేకపోవడం వంటి అనేక సమస్యలతోసతమతమవుతున్నారని పేర్కొన్నారు. పని చేసే సమయంలో ప్రమాదాలకు గురైన కార్మికులకు తగిన నష్టపరిహారం అందడం లేదని, వారి పిల్లల విద్య, కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డుల మంజూరు, పెన్షన్ సదుపాయం, ప్రసూతి సహాయం, ప్రమాద బీమా, విద్యా సహాయం, గృహ నిర్మాణ సబ్సిడీ వంటి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన కోరారు. అలాగే అసంఘటిత రంగ కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయూ) గ్రామ అధ్యక్షుడు జినక జామూర్తి, కార్యదర్శి జినక సైదులు, కార్మికులు నందిపాటి సామెలు, జిన్న పవన్, పోలె పొంగు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.