తాండాల ప్రజల ఆరోగ్య సమస్యలపై శంభీపూర్ కృష్ణ
ఆందోళన
అనారోగ్య బాధితులను పరామర్శించిన బీఆర్ఎస్ నేత
అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా
వాయు కాలుష్యం, కలుషిత నీటితో ప్రజలు ఇబ్బందులు
మంచినీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

దుండిగల్, జూన్ 12 ( నమస్తే భారత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ సర్కిల్ పరిధిలో గాగిల్లాపూర్ తాండా, దుండిగల్ తాండాలకు చెందిన అనారోగ్య బాధితులను బీఆర్ఎస్ నేత శంభీపూర్ కృష్ణ శుక్రవారం పరామర్శించారు. మాజీ కౌన్సిలర్ కొర్ర శంకర్ నాయక్‌తో కలిసి బాధితుల నివాసాలకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. గాగిల్లాపూర్ తాండాకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త జగన్ నాయక్ ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా, దుండిగల్ తాండాకు చెందిన కాట్రోత్ లక్ష్మణ్ నాయక్ కిడ్నీ, ఊపిరితిత్తుల వ్యాధులతో చికిత్స పొందుతున్నారని తెలుసుకుని వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడిన శంభీపూర్ కృష్ణ, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించే విషయంలో తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా కల్పించారు. అనంతరం కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న లక్ష్మిబాయి, ఫకీరా రాజు నివాసాలకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాండా ప్రజలు తమ సమస్యలను శంభీపూర్ కృష్ణ దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా వాయు కాలుష్యం, కలుషిత తాగునీటి కారణంగా ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తాండా ప్రాంతాల్లో స్వచ్ఛమైన మంచినీటి సౌకర్యం కల్పించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షుడు అమర్‌సింగ్ నాయక్, వెంకటేష్ నాయక్, ప్రవీణ్ నాయక్, హనుమంతు, నర్సింగ్ నాయక్, కుమార్ నాయక్, రాజు నాయక్, వాసు నాయక్, పటేల్ రెడ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
