NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 2:33 pm Posted by : NAMASTHE BHARAT

జాంబవంతుని గుడి స్థలంపై అక్రమ నిర్మాణాలు తొలగించాలి

జాంబవంతుని గుడి స్థలంపై అక్రమ నిర్మాణాలు తొలగించాలి

కబ్జాలకు అడ్డుకట్ట వేయాలని దళిత సంఘాల డిమాండ్

స్థలాన్ని రక్షించేందుకు ఐక్యంగా పోరాడతామని హెచ్చరిక

చర్యలు తీసుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామన్న నాయకులు

కుత్బుల్లాపూర్, జూన్ 13 ( నమస్తే భరత్ ): జగద్గిరిగుట్టలోని జాంబవంతుని గుడి స్థలాన్ని కబ్జా చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తూ, ఆ స్థలాన్ని పరిరక్షించేందుకు దళిత సంఘాలు ఐక్యంగా ఉద్యమిస్తాయని నాయకులు హెచ్చరించారు. ఈ అంశంపై శనివారం నిర్వహించిన సమావేశంలో పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జాంబవంతుని గుడి స్థలంలో కొందరు వ్యక్తులు అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఆ స్థలాన్ని విక్రయించి నిర్మాణాలు చేపట్టడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఈ విషయమై ఇటీవల కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గతంలో ఇదే స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టినప్పుడు రెవెన్యూ అధికారులు వాటిని తొలగించారని గుర్తు చేశారు. అయినప్పటికీ మళ్లీ మళ్లీ కబ్జా యత్నాలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాంబవంతుని గుడి స్థలంపై ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరగకుండా అధికారులు శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి ప్రస్తుతం జరుగుతున్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని కోరారు. లేనిపక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. జాంబవంతుని గుడి స్థలాన్ని విక్రయించేందుకు లేదా కబ్జా చేసేందుకు ప్రయత్నించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో దళిత హక్కుల పోరాట సమితి నాయకులు దొరవి బాబు, రాములు, ఎంఆర్పీఎస్ నాయకులు అల్వాల భాస్కర్, ఆర్టీసీ బాబు, ముఖేష్, రమేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఉమామహేష్ తదితరులు పాల్గొన్నారు.