NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 2:12 pm Posted by : NAMASTHE BHARAT

కేసీఆర్‌ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నేతలకు లేదు

కేసీఆర్‌ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నేతలకు లేదు

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తీవ్ర ఆగ్రహం

విప్ పదవికి తగిన బాధ్యతలు నిర్వర్తించకుండా ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారని ఆరోపణ

రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శ

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రజా మద్దతు స్పష్టమైందని వ్యాఖ్య

ప్రజాక్షేత్రంలో కేసీఆర్ నాయకత్వానికే ఆదరణ ఉందని స్పష్టం

కుత్బుల్లాపూర్, జూన్ 13 ( నమస్తే భరత్ ) :తెలంగాణ రాష్ట్ర సాధకుడు, బీఆర్‌ఎస్ అధినేత కలవకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్)పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్రంగా ఖండించారు. మీడియాతో మాట్లాడుతూ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు.
ప్రభుత్వ విప్‌గా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సమన్వయం సాధిస్తూ శాసనసభ వ్యవహారాలను సజావుగా నడిపించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, ఆ బాధ్యతలను విస్మరించి బీఆర్‌ఎస్ పార్టీపై విమర్శలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. దీంతో విప్ పదవికే కళంకం తెస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రైతులు విత్తనాలు, ఎరువుల కొరతతో పాటు పండించిన పంటలకు సరైన ధరలు లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివేకానంద్ అన్నారు. రైతాంగం అనేక సమస్యలతో సతమతమవుతుండగా ప్రభుత్వం వాటి పరిష్కారంపై దృష్టి పెట్టకుండా రాజకీయాలకే పరిమితమైందని విమర్శించారు.
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్ర సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాల్సిన సమయంలో రాజకీయ పర్యటనలకు ప్రాధాన్యం ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ తన బలాన్ని చాటుకుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఆయన అన్నారు. అధికార దుర్వినియోగం, ధనబలం, అధికార బలం ఉన్నప్పటికీ ప్రజలు కాంగ్రెస్ వైపు లేరని పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో ఇప్పటికీ కేసీఆర్ నాయకత్వానికే ఆదరణ ఉందని వివేకానంద్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పోషించిన పాత్రను ఎవరూ విస్మరించలేరని, ఆయనపై విమర్శలు చేసే ముందు కాంగ్రెస్ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు వంటి నాయకులపై మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ నేతలు తమ స్థాయిని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ప్రజల సమస్యలపై స్పందించి ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దుకోవడంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ విప్‌కు సూచించారు.
అంతేకాకుండా, రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజల మద్దతు లభిస్తుందని, రానున్న ఎన్నికల్లో పార్టీ మరింత బలంగా నిలుస్తుందని వివేకానంద్ ధీమా వ్యక్తం చేశారు.