NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 2:07 pm Posted by : NAMASTHE BHARAT

ఆర్జీకే కాలనీలో సమస్యలపై ఎమ్మెల్యే వివేకానంద్ ఆకస్మిక పర్యటన

ఆర్జీకే కాలనీలో సమస్యలపై ఎమ్మెల్యే వివేకానంద్ ఆకస్మిక పర్యటన

-త్రాగునీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు

-చిరు వ్యాపారుల ఉపాధికి భంగం కలగకుండా చర్యలు

-కాలనీ సంక్షేమ సంఘం భవనం, రోడ్ల నిర్మాణ అంశాలపై సమీక్ష

-ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని స్పష్టం

జగద్గిరిగుట్ట, జూన్ 13 ( నమస్తే భరత్ ):జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప (ఆర్జీకే) కాలనీలో నెలకొన్న పలు సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ శనివారం విస్తృతంగా పర్యటించారు. కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ధర్మారపు అంజయ్య, ప్రధాన కార్యదర్శి భూపతి రెడ్డి, స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలిసి సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు ప్రధానంగా త్రాగునీటి సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులు, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల ఏర్పడుతున్న సమస్యలు, జీవనోపాధి కోసం ఏర్పాటు చేసుకున్న చిరు వ్యాపారుల షాపుల తొలగింపు అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా సంక్షేమ సంఘం భవన నిర్మాణం, అంతర్గత రహదారుల అభివృద్ధి వంటి సమస్యలను కూడా వివరించారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించిన ఎమ్మెల్యే వివేకానంద్, మాజీ కార్పొరేటర్ జగన్‌తో కలిసి కాలనీలోని పలు ప్రాంతాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ, కాలనీ ప్రజలకు మౌలిక వసతుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. త్రాగునీటి కొరత, డ్రైనేజీ సమస్యలను అత్యవసర ప్రాతిపదికన పరిష్కరించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేశారు. చిరు వ్యాపారుల సమస్యపై స్పందిస్తూ, ఉపాధి కోసం చిన్నచిన్న దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వారి జీవనోపాధి దెబ్బతినకుండా తగిన పరిష్కారం చూపాలని సూచించారు. అధికారులు మాట్లాడుతూ త్రాగునీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని, చిరు వ్యాపారుల సమస్యను కూడా సానుకూలంగా పరిశీలించి వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మహిళలు, చిరు వ్యాపారులు, యువకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.